ఏపీలో రోడ్లకు మరొకరు బలి.. పుట్టిన కుమార్తెను కళ్లారా చూడకుండానే కానరాని లోకాలకు! | condition of the roads in ap| miserable| lives| loss| government| neglence| people
posted on Oct 23, 2023 7:08AM
రాష్ట్రంలో రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోవాలని.. అందుకు తగిన మార్గర్శకాలు సిద్ధం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఏపీలో రోడ్లకు మహర్దశ రాబోతుందని, రూ.వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రులు మీడియా ముందుకొచ్చి ప్రజలకు వివరించారు. పోనీలే ఇకనైనా రహదారి కష్టాలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రజలు ఆశపడ్డారు. కానీ, ప్రకటనలకే తప్ప ఆచరణను మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోరు. మంత్రులు మళ్ళీ ఆ ఊసే ఎత్తరు. గత నాలుగేళ్ళరేళ్ళలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇలాంటి ప్రకటనలు రావడం.. ప్రజలు ఆశపడడం.. మన బతుకు ఇంతేలే అని రాజీ పడడం, నిరాశపడటం ప్రజలకు అలవాటైపోయింది.
రాష్ట్రంలో గుంతల రోడ్లతో వాహనదారుల బండ్లు, ఒళ్ళు గుల్లయిపోతున్నాయి. ఏపీలో రోడ్డెక్కితే బండికి ఏది ఎక్కడ ఊడిపోతుందో అర్ధంకాకపోగా.. అసలు రోడ్డు మీదకి వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి క్షేమంగానే వస్తాడా అని ఆ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూసే పరిస్థితులు దాపురించాయి. వర్షాకాలంలో రోడ్ల మీద గుంతలలో నీరు నిలిచి అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో కూడా అర్ధం కాక ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలే కాదు.. ఆర్టీసీ బస్సులు సైతం రోడ్ల మీద వెళ్తుండగానే చక్రాలు ఊడిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రోడ్లెక్కి నిరసనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా మాట్లాడితే.. వాహన మిత్ర పేరుతో డబ్బులు ఇస్తున్నాం కదా రోడ్లు వేసేందుకు డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఉల్టా మాట్లాడిన మంత్రులు కూడా ఉన్నారు. దీంతో అసలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు అనే మాటకు తావులేదని జనం కూడా నిర్ధారణకు వచ్చేశారు. ప్రభుతాన్ని, సీఎంను రోడ్డెక్కిన ప్రతిసారి తిట్టుకుంటూనే గతుకుల రోడ్లపై ఒళ్లు హూనమౌతున్నా, బండ్ల రిపేర్లకు జేబులు ఖాళీ అయిపోతున్నా పట్టించుకోకుండా తిరుగుతూనే ఉన్నారు. అందుకు అలవాటు పడిపోయారు. కానీ, అన్ని రోజులు మనవే కాదు కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా గుంతల రోడ్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్ల కారణంగా ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఓ ప్రమాదం మాత్రం మనసులు కలచివేసింది. కన్నులు చెమర్చేలా చేసింది. మనసు వికలమయ్యేలా చేసింది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజని అనే మహిళ నిండు గర్భిణీ కాగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు లేరు. కుటుంబ సభ్యులు ఆమెను గురజాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ సదుపాయాలు లేవు. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, గర్భిణీ వెళ్లిన రోడ్లన్నీ గుంతల మయమే కావడంతో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. చివరకు అదృష్టం కొద్దీ అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గురజాల ఆసుపత్రి నుండి భార్యను తరలించే సమయంలో నరసారావు పేట ఆసుపత్రిలో కూడా చేర్చుకోకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే ఉద్దేశ్యంతో భర్త ఆనంద్ డబ్బులు తీసుకు రావడానికి వెళ్ళాడు. గురజాల వరకు గర్భిణీకి తోడుగా వచ్చిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని వెళ్ళాడు.
ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొని వస్తుండగా జోలకళ్ళు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు గుంతల్లో బోల్తా పడింది. దీంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో ఆయన భార్య, అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఉన్నారు. కానీ వారిని చూసుకునే భాగ్యం ఆనంద్ కు కలుగలేదు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ కన్నుమూశాడు. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే తండ్రి మృతి చెందడం అందరికీ కన్నీరు తెప్పించింది. దిక్కుమాలిన రోడ్ల కారణంగానే ఇంతటి ఘోరం జరిగిందని ఆనంద్ కుటుంబం విలపిస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఒక ఆనంద్ పరిస్థితి మాత్రమే కాదని.. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంలో ప్తి రోజూ ఏదో ఒక కుటుంబంలో ఇలాంటి విషాదం నెలకొనడం పరిపాటిగా మారిందని నెటిజన్లు అంటున్నారు.