Leading News Portal in Telugu

Rohit Sharma: సగం లక్ష్యమే పూర్తయింది.. ముందుంది అసలు పండగ!


Rohit Sharma: సగం లక్ష్యమే పూర్తయింది.. ముందుంది అసలు పండగ!

Rohit Sharma React on India win against New Zealand: వన్డే ప్రపంచకప్‌ 2023లో తమ లక్ష్యం సగం మాత్రమే పూర్తయిందని, అసలు సమరం (సెమీస్, ఫైనల్) ముందుంది అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొహ్మద్ షమీతో పాటు ఇతర బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారన్నాడు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు గతంలోనూ ఎన్నో వచ్చాయని రోహిత్ కొనియాడాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను రోహిత్ సేన ఓడించింది. భారత్ విజయంలో షమీ, కోహ్లీ, జడేజాలు కీలక పాత్ర పోషించారు.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. టోర్నీలో ఒక్కో మ్యాచ్‌ గెలుచుకుంటూ వెళుతున్నాం. ప్రపంచకప్‌ విజయంలో మా లక్ష్యం ఇంకా సగమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడం కీలకం. తర్వాత మ్యాచ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. మొహ్మద్ షమీ వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. షమీ లాంటి క్లాస్ బౌలర్‌కు ధర్మశాల వంటి పిచ్‌ అనుకూలంగా ఉంటుందని నిరూపించాడు. ఓ దశలో న్యూజిలాండ్‌ 300లకు పైగా స్కోరు చేస్తుందని అనుకున్నా. షమీ సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. అందరూ బాగా బౌలింగ్ చేశారు… ఈ విజయం బౌలర్లదే’ అని అన్నాడు.

‘నేను నా బ్యాటింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తా. వేర్వేరు వ్యక్తిత్వాలు గల నేను, గిల్ మాట్లాడనుకుంటూ ముందుకు వెళ్లాం. చివరకు విజయం సాధించడం ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. గత కొన్నేళ్లుగా తన ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. వికెట్స్ కోల్పోయినప్పుడు కోహ్లీ, జడేజాల భాగస్వామ్యం విజయానికి దగ్గర చేసింది. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. అన్నింటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. విభిన్న ప్రాంతాల్లో మ్యాచ్‌లు ఆడడాన్ని మేం ఆస్వాదిస్తున్నాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.