
కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు లేదన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన అభ్యర్థిని దించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు.
నేను కామారెడ్డి బిడ్డను.. నా పుట్టుక, మరణం కామారెడ్డితోనేనన్నారు. ఇదివరకే చెప్పాను నేను ఈ మట్టి మనిషిని మరి నీవు రాజకీయ ప్రయోజనాల కోసం గజ్వేల్ నుంచి ఇక్కడికి వస్తున్నావని షబ్బీర్ అలీ అన్నారు. తాను కామారెడ్డిలో ఉండను.. గజ్వేల్ ప్రజలతో ఉంటానని సీఎం కేసీఆర్ బహిరంగంగా చెప్పారని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యల పై కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని తెలిపారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.