
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు. ప్రతీ కార్యక్రమానికి ఇరు పార్టీల కేడర్ హాజరయ్యేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించారు.
ఇదిలా ఉంటే.. టీడీపీ తరపున మీటింగ్ కు హాజరైన వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. అలాగే.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు.
ఇక జనసేన పార్టీ తరపున.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర రెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యురాలు పాలవలస యశస్వి, నరసాపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు.