Leading News Portal in Telugu

Train Accident: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి, 100 మందికి గాయాలు


Train Accident: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి, 100 మందికి గాయాలు

Train Accident: బంగ్లాదేశ్ రాజధాని సమీపంలో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 100 మందికి గాయాలయ్యాయి. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని భైరబ్ వద్ద మధ్యాహ్నం గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం తెలిపారు. రైలు కింద పలువురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది కోచ్‌ల కింద పడి ఉన్నారని.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తరలించడంలో స్థానిక ప్రజలు కూడా సహాయం చేస్తున్నారు. రెండు కోచ్‌లు ఢీకొనడంతో గూడ్స్ రైలు ఎగరో సింధూర్‌పై వెనుక నుంచి దూసుకెళ్లిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని ఢాకా రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ అన్వర్ హొస్సేన్ తెలిపారు.