
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అయింది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన – టీడీపీ పొత్తు చరిత్రాత్మకమన్నారు.
ఇవాళ్టి సమావేశం హిస్టారికల్ మీటింగ్ అని పవన్ కల్యాణ్ అన్నారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది.. కానీ చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని బెయిల్ రాకుండా చేసిందని ఆరోపించారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు. రెండు పార్టీలు కలిసి క్షేత్ర స్థాయిలో పని చేసే అంశంపై చర్చించామని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక మళ్లీ రాజమండ్రిలో ఇలాంటి మీటింగ్ పెడతామని అన్నారు.