బీఆర్ఎస్ రైతు రుణమాఫీకి తిలోదకాలిచ్చేసిందా? | brs ignore farmer loan waiver| kcr| manifesto| mention| congress| 2lacs| one
posted on Oct 24, 2023 1:23PM
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఊసే లేకపోవడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రుణమాఫీకి బీఆర్ఎస్ తిలోదకాలిచ్చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతాంగం రుణమాఫీ హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని బీఆర్ఎస్ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటుంటే.. రైతులు మాత్రం పెదవి విరుస్తున్నారు. రైతు బంధు సహా పది హామీలను ప్రకటించిన కేసీఆర్ రుణమాఫీని మాత్రం పూర్తిగా విస్మరించారు. పాత విధానాలు అన్ని యథావిథిగా కొనసాగుతాయని మేనిఫెస్టోలో ప్రకటించినా.. రైతు రుణమాఫీ ప్రస్తావనే లేకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్ష వరకు రుణమాఫీపై బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) విస్పష్ట హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ హామీని 2018 ఎన్నికల సమయంలోనూ పునరుద్ఘాటించింది. ఫస్ట్ టర్ములో నాలుగు విడతల్లో అమలు చేసినట్లుగానే రెండో టర్ములో కూడా సంపూర్ణం చేస్తామని అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ నాలుగున్నరేండ్లు పూర్తయ్యి ఎన్నికలకు వెళ్తున్నా ఇంకా బకాయిలు ఉండిపోయాయి.
గత రెండు ఎన్నికలలోనూ మేనిఫెస్టోల్లో రుణమాఫీ గురించి విస్పష్ట హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈసారి మేనిఫెస్టోలో కనీసంగానైనా ప్రస్తావించకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలోనూ, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నూ చేర్చినా.. ఇప్పుడు మాత్రం దానిని కనీసం ప్రస్తావించకపోవడంతో కేసీఆర్ రుణమాఫీపై చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జనం ప్రశ్నలకు బీబర్ఎస్ నేతలు సమాధానం ఇవ్వడం లేదు. గత ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చినా అది సంపూర్ణంగా నెరవేరకపోవడంతో.. బకాయిల సంగతేమిటని రైతులు నిలదీస్తున్నారు. రుణమాఫీ అంశంలో కేసీఆర్ మౌనంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.
ఇలా ఉండగా కాంగ్రెస్ ఇప్పటికే రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రుణమాఫీ వ్యవహారం బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది.