Leading News Portal in Telugu

నిజం గెలవాలి.. గెలుస్తుంది.. నారా భువనేశ్వరి బస్సు యాత్ర | truth must win| nara| bhuwaneswari| bus| yatra| naravaripalle


posted on Oct 25, 2023 10:17AM

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉండగా, ఆయన సతీమణి నారా భువనేశ్వరి   ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర కు సంకల్పించారు.  చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు చేపట్టిన ఈ యాత్రలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమవుతారు. సభలూ, సమావేశాలలో ప్రసంగిస్తారు. బాబు అక్రమ అరెస్టును, జగన్ సర్కార్ వేధింపులను ప్రజలకు వివరిస్తారు. ఈ యాత్ర ప్రారంభం సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ అందరినీ కదిలిస్తున్నది.

“నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో నే నారావారి పల్లెకు వచ్చే నేను, ఆయన తోడు లేకుండా తొలి సారిగా  ఒంటరిగా వచ్చారు. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరి దేవత నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో   తొలి అడుగు వేస్తున్నాను”  అంటూ ఆ ట్వీట్ లో నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేసినప్పటి నుంచీ ఆమె రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. ఆయన అరెస్టు అయిన క్షణం నుంచీ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తొలి సారి రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె తనలో సగ భాగాన్ని అక్కడే వదిలి వచ్చినట్లుందని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు.

రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చినా నారా భువనేశ్వరి ఇప్పటి వరకూ ఎన్నడూ రాజకీయ వేదికలపై కనిపించింది లేదు. తండ్రి ముఖ్యమంత్రిగా పని చేశారు. భర్త ముఖ్యమంత్రిగా పని చేశారు. కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. అయినా నారా భువనేశ్వరి ఇంత వరకూ ఎన్నడూ రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. రాజకీయ వేదికలపై కనిపించింది లేదు. ప్రసంగించింది లేదు. అయితే తన భర్తను అక్రమంగా అరెస్టు చేయడంతో ఆమె  తొలి సారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.  నిజం గెలవాలి అంటూ ఆమె బస్సు యాత్ర బుధవారం(అక్టోబర్ 25) చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. చంద్రబాబు  అరెస్టును తట్టుకోలేక మరణించిన చిన్నస్వామి నాయుడు, ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను ఆమె తన తొలి రోజు యాత్రలో పరామర్శిచారు. అనంతరం నిజం గెలివాలి కార్యక్రమంలో భాగంగా మహిళలతో భేటీ అవుతారు.  

వారానికి మూడు రోజుల పాటు చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. గత 47రోజులుగా జైలులో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలుపనున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతోపాటు అండగా ఉంటామంటూ భరోసాను నారా భువనేశ్వరి ఇవ్వనున్నారు. మొత్తం మీద నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ద్వారా తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా మరింత జోష్ తో ముందుకు కదిలేందుకు అవసరమైన చైతన్యాన్ని నింపుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.