బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా సునీల్ కనుగోలు వ్యూహాలు!? | sinil kanumol stratagies to suffocate brs| eye| key| strong| leaders| kcr| ktr
posted on Oct 25, 2023 3:06PM
తెలంగాణలో అదికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ప్రత్యర్థి పార్టీలలోని అసంతృప్తులకు గాలం వేయడం ద్వారా ఆ పార్టీలను బలహీనపరిచే ఎత్తుగడులతో ముందుకు సాగుతోంది. అందు కోసమే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం చేస్తున్నది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలోని సీనియర్ నేతలు, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతలపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టిందనీ, వారికి నేరుగా హస్తిన నుంచే పార్టీలోకి ఆహ్వానాలు అందుతున్నాయనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత.. అన్నిటికీ మించి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక ఇదే వ్యూహం, ఇదే ఎత్తుగడ ఉందని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే పార్టీ మునుగోడు అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అలాగే మరో బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామి కూడా ఒకటి రెండు రోజులలో హస్తం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డిలు, అలాగే బీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా కాంగ్రెస్ వ్యూహాల వెనుక కర్నాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సునీల్ కొనుగోలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మైనంపల్లి , పొంగులేటి , తుమ్మల తదితరులు కాంగ్రెస్ పంచన చేరడంలో సునీల్ కనుగోల్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఒక కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో కూడా మరిన్ని చేరికలు ఉండేలా సునీల్ కనుగోలు వ్యూహాలు రూపొందించారని అంటున్నారు.
ఇక ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ను గుక్కతిప్పుకోనీయకుండా చేయడం కోసం ఆ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా దృష్టి పెట్టిందనీ, ఆయా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపి బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయాలన్న వ్యూహంతో సునీల్ కనుగోలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్ పై పోటీకి ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నర్సారెడ్డి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచనలో పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సిరిసిల్ల నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను రంగంలోకి దించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.