Leading News Portal in Telugu

కోడి, క్వార్టర్ .. బాటిల్.. ఓటర్లకు వైసీపీ గాలం! | ycp distribute hen and liquor| duserra| vizag| sweets| cockers| votes


posted on Oct 25, 2023 3:50PM

ఏపీలో అధికార వైసీపీకి అసలు ప్రజలంటే ఎంత చులకనో.. ఎన్నికలు, రాజ్యాంగం అంటే కూడా అంతే చులకన అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేక వైసీపీ ఇప్పుడు ఓటమి భయంతో గిలగిలలాడుతోంది. ప్రజలలో అసంతృప్తి తార స్థాయికి చేరడంతో వారిని ఎలాగోలా బుజ్జగించో, బెదరించో, బెల్లించో దారికి తెచ్చుకోవాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయం ఉండగానే ఇప్పటి నుండే రకరకాల తాయిలాలు పంపిణీ చేసి ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నది. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసి వారిని మత్తులో ముంచి ఓట్లు గుద్దించుకోవాలని చూస్తుంది. ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో భారీగా మద్యం పంపిణీ చేశారు. సభల పేరిట జనసమీకరణ చేసి వారికి మద్యం తాగించి  వైసీపీకి ఓట్లేస్తామన్న హామీలు తీసుకున్నారు. కాగా, ఇప్పుడు దసరా పండగ పేరిట రాష్ట్రంలో పలుచోట్ల రకరకాల బహుమతులు, మద్యం సీసాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా విశాఖలో పాగా వేయాలని చూస్తుండగా.. ఇక్కడ బరితెగించి మద్యం పంపిణీ చేశారు.

దసరా సందర్భంగా విశాఖ తూర్పు, దక్షణ నియోజకవర్గాలలో వైసీపీ నేతలు రకరకాల బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. కొన్ని వార్డులలో అయితే మనిషికి ఒక క్వార్ట్రర్ మందు. ఇంటికో కోడి  పంపిణీ చేశారు.  విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ ఈసారి ఎంపీ ఎంవిబి సత్యనారాయణను బరిలో దించనుంది. ఎంపీగా ఘోరంగా ఫెయిలైన నేత సత్యనారాయణ. అయితే ఆర్ధికంగా బలమైన నేత కావడంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబుపై ఈసారి ఇక్కడ ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే దసరా రోజున స్వీట్లు పంచి పెట్టారు. ప్రతి ఇంటికి అరకిలో స్వీట్లు లెక్కన వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరగా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఆయన్నే పోటీ కి దింపుతోంది.. ఈ తరుణంలో ఆయన కూడా ఇప్పటి నుండే తాయిలాలు పంచుతున్నారు. దసరా రోజున గణేష్ ఏకంగా కుక్కర్లు పంపిణీ చేశారు. 

ఇక, అదే దక్షణ నియోజకవర్గానికి చెందిన వార్డులకు వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి బాబు ఆనంద్ అయితే తన నాలుగు వార్డులలో ఒక్కొక్కరికి ఒక కోడి, ఒక మద్యం సీసా పంపిణీ చేశారు. అది కూడా యథేచ్ఛగా ఏదో చీర సారె పంచినట్లుగా పబ్లిక్ గా పంచిపెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వైసీపీ నేతల బరితెగింపుపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కార్యాలయం ఎదుటే బజారుకెక్కి   అదేదో ఘనకార్యం చేసినట్లుగా మద్యం పంపిణీ చేయడంపై మహిళలు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. అసలు మద్యపాన నిషేధం చేస్తామని హామీనిచ్చి అధికారం దక్కించుకున్న పార్టీ ఇప్పుడు ఇలా మళ్ళీ ఓట్ల కోసం మద్యం పంపిణీ చేయడం బరితెగింపు కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. 

కోళ్లు, మందు బాటిళ్లు తీసుకోవడం కాదు.. కాస్త మమ్మల్ని గుర్తుపెట్టుకోండంటూ ఓటర్లను సిగ్గులేకుండా విజ్ఞప్తి చేసుకోవడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. విశాఖ కేంద్రంగా వైసీపీ ఈసారి ఎన్నికల కోసం భారీ టార్గెట్ పెట్టుకుంది. గత పదేళ్లుగా  జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. సాక్షాత్తు జగన్ తల్లి విజయమ్మను బరిలో దింపినా విశాఖ ప్రజలు ఓడించి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో విశాఖను తన అడ్డాగా మార్చుకోవాలని రాజధాని తరలింపు డ్రామాకు తెరలేపారు. అయితే, రాజధానిపై జగన్ తేదీలు మార్చుకుంటూ వెళ్లడంతో ఇక్కడి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉండగా..   జనసేన కూడా తోడవడంతో వైసీపీకి స్కోప్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీంతో ఎలాగైనా ఇక్కడ ప్రజలను తమ వైపుకు తిప్పుకోవాలని బరితెగించి ఇలా  మద్యం పంపిణీకి దిగారు.