posted on Oct 25, 2023 5:43PM
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు బుధవారం బీఫామ్ అందించారు. ప్రగతి భవన్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి బీఫామ్‌ను అందించారు.
అందరికంటే ముందే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ గోషామహల్, జనగాం, నాంపల్లి, నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించలేదు. జనగాం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి పేర్లను ప్రకటించినప్పటికీ గోషామహల్ , నర్సాపూర్ అభ్యర్థులను కెసీఆర్ పెండింగ్ లో పెట్టారు. బుధవారం నర్సాపూర్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ప్రకటించారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ టిక్కెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో మదన్ రెడ్డి నర్సాపూర్ సీటుపై వెనక్కి తగ్గారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… మదన్ రెడ్డి తనతో పాటు మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారని, ఆయనతో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. తనకు ఆప్తుడు, కుడిభుజం లాంటి వాడన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజాలపై వేసుకొని సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యతను తీసుకున్నారన్నారు. ప్రస్తుతం కొత్త కోట ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న మెదక్ నుంచి మదన్ రెడ్డికి అవకాశమివ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు.
మదన్ రెడ్డి మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్నారు. ఆయన సేవలను పార్టీ మరింతగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ బీఫామ్ ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి తన ప్రతిష్ఠను మరింతగా పెంచుకున్నారన్నారు. అందుకు ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు అని కెసీఆర్ అన్నారు.