Leading News Portal in Telugu

జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై పురంధేశ్వరి ఫిర్యాదులు బుట్టదాఖలేనా? | bjp hicommand ignore purandeswari complaints| jagan| government| anarchy| madyam


posted on Oct 25, 2023 1:14PM

బీజేపీ అగ్రనాయకత్వం తమ పార్టీ రాష్ట్ర శాఖల విషయంలో  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నది. ఒక  రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖకు అన్ని  విధాలుగా అండదండలు అందించే పార్టీ  మరో రాష్ట్రంలో సొంత నాయకులకే ముందరి కాళ్లు బంధం వేసి వెనక్కులాగేస్తుంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల విషయంలో బీజేపీ హైకమాండ్ కు ఒక వ్యూహం, ఒక  ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక విధానం ఉన్నట్లు కనిపించదు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సర్వశక్తులూ ఒడ్డి పని చేస్తున్న అధ్యక్షుడిని పదవి నుంచి  దింపేసి.. మరొకరికి పార్టీరాష్ట్ర  పగ్గాలుఅప్పగించడం, ఆ కారణంగా రేసు గుర్రంలాసాగుతున్న పార్టీ ప్రస్థానం ఒక్కసారిగా చతికిల పడిపోయే పరిస్థితి ఏర్పడినా పెద్దగా పట్టించుకోదు. తెలంగాణలో అదే జరిగింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు  బండి  సంజయ్ చేతుల్లో ఉన్నంత  కాలం తెలంగాణలో బీజేపీ  బీఆర్ఎస్ కు  గుబులు పట్టిస్తూనే వచ్చింది. అయితే ఎప్పుడైతే బండి  సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిని నియమించిందో.. ఆ క్షణం నుంచీ  రాష్ట్రంలో బీజేపీ రేసు గుర్రంలా దౌడు తీయడం అటుంచి కనీసం అడుగులు కూడా ముందుకు పడని స్థితికి చేరుకుంది. 

ఇక  ఏపీ  విషయానికి వస్తే.. పార్టీని పాతాళానికి దించేసిన  సోము వీర్రాజును పార్టీ  రాష్ట్ర  అధ్యక్ష పదవి  నుంచి తప్పించి పగ్గాలను  సీనియర్ నాయకురాలు  పురంధేశ్వరికి అప్పగించింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ పురంధేశ్వరి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆర్థిక  అరాచకత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మద్యం మాఫియా వంటి విషయాలపై గళమెత్తుతూ ఆ పార్టీ అవకతవకలపై కేంద్రానికి వరుస నివేదికలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. అయితే అందుకు ప్రతిగా బీజేపీ  హై కమాండ్ నుంచీ, కేంద్రం నుంచీ నిష్క్యియాపరత్వం, కొండొకచో అధికార  పార్టీకి మద్దతుగా ప్రకటనలు వస్తున్నాయి. 

ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసే పిర్యాదుల్ని, మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకల్ని,  మద్యం స్కాం గురించి గణాంకాలతో సహా ఇచ్చిన నివేదికలను బుట్టదాఖలు చేయడమే కాకుండా..  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను పార్లమెంటు వేదికగా సమర్ధించి చిన్న బుచ్చింది.   కేంద్ర ఆర్థిక శాఖ తీరు కారణంగా రాష్ట్రంలో తమ పార్టీ ఇబ్బందుల్లో పడిందని పురంధేశ్వరి బాహాటంగానే చెప్పారు.  

ఇప్పుడు ఆమె ఒక అడుగు ముందుకు వేసి జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో  రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోందని, నిబంధలను తుంగలోకి తొక్కి, ఎలాంటి ఆర్థిక అంచనాలూ లేకుండానే.. కార్పోరేషన్ల పేరిట కోట్లాది రూపాయల రుణం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో వైసీపీ సర్కార్ నిండా మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.  

పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు మాత్రమే కాదు.. పార్టీలో ఆమె  తన పలుకుబడి ఉపయోగించి   రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకలు, అరాచకత్వంపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు జరిగేలా చేయగలిగితే జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం ఆ మేరకు చర్యలు తీసుకుంటుందా? లేక   ఏపీలో పార్టీ బలోపేతం కావడం కంటే.. వైసీపీ శ్రేయస్సే ముఖ్యమని భావిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.  మొత్తం మీద జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై పురంధేశ్వరి చేస్తున్న పోరాటం మాత్రం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది.