Leading News Portal in Telugu

Nipah virus: అక్కడి గబ్బిలాల్లో “నిపా వైరస్” ఉండే అవకాశం..కేరళ సర్కార్ వార్నింగ్..


Nipah virus: అక్కడి గబ్బిలాల్లో “నిపా వైరస్” ఉండే అవకాశం..కేరళ సర్కార్ వార్నింగ్..

Nipah virus: గత నెలలో కేరళ రాష్ట్రాన్ని మరోసారి ‘నిపా వైరస్’ వణించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి సోకి ఇద్దరు మరణించారు. అయితే కేరళ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని మిగిలిన వారికి ప్రాణాపాయం లేకుండా రక్షించగలిగింది. ఇదిలా ఉంటే తాజాగా నిపా వైరస్ గురించి ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ జిల్లాలోని గబ్బిలాల్లో నిపా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆమె బుధవారం తెలిపారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)’ రిపోర్టులను ఉటంకిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐసీఎంఆర్ సేకరించిన గబ్బిలాల నమూనాల ఆధారంగా ఈ రిపోర్టు ఇచ్చిందని ఆమె తెలిపారు. అయితే దీనర్థం కొత్తగా ఆ జిల్లాలో వైరస్ కేసులు నమోదైనట్లు కాదని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ, సాధారణ ప్రజలను అప్రమత్తం చేయడానికి మాత్రమే అని ఆమె చెప్పారు. వయనాడ్ లోనే కాదు ఇతర జిల్లాల్లోని గబ్బిలాల్లో కూడా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు.

గత నెలలో కోజికోడ్ జిల్లాలో ఆరుగురికి నిపా వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు మరణించారు. మరణించిన వారి కాంటాక్టు లిస్టులో ఉన్న వారంత ఐసోలేషన్, క్వారంటైన్ పిరియడ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. దాదాపు 70-90 శాతం ఉండే నిపా మరణాలను 33 శాతానికి తగ్గించడం గర్వించదగ్గ విషయమని ఆమె అన్నారు. నిపా రీసెర్చ్ కోసం కేరళలో వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైరస్‌ని ఎదుర్కోవడానికి నిర్దిష్ట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ వంటి చర్యలను మంత్రి ప్రస్తావించారు. 2018 తర్వాత రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగోసారి నిపా వైరస్ వ్యాప్తి చెందింది.