Leading News Portal in Telugu

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య..


Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8 సార్లు తొక్కించి సోదరుడి హత్య..

Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్‌పూర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ రోజు ఉదయం బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్ తో వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు. కాసేపటికి అదే ప్రాంతానికి అతర్ సింగ్ కుటుంబం వచ్చింది. కొద్ది సేపటి తర్వాత భూమి విషయమై ఇరు కుటుంబాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలోనే తుపాకీ శబ్ధాలు వినిపించాయని గ్రామస్తులు ఆరోపించారు.

ఈ దాడి సమయంలో అతర్ సింగ్ కుమారుల్లో ఒకరైన నిర్పత్ నేతలపై పడిపోయాడు. నిందితుడు దామోదర్, నిర్పత్ చనిపోయే దాకా ట్రాక్టర్ తో అతనిని తొక్కించాడు. ఇరు కుటుంబాలకు చెందినవారు వారించినప్పటికీ కూడా నిందితుడు దామోదర్ ట్రాక్టర్ ఆపకుండా 8 సార్లు తొక్కిస్తూనే ఉన్నాడు. దీంతో నిర్ఫత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘర్షణల్లో దాదాపుగా 10 మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు ఐదు రోజుల మందు ఇలాగే రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ సమయంలో బహదూర్ సింగ్, అతని తమ్ముడు జనాక్ పై అతర్ సింగ్, అతని కొడుకు నిర్పత్ దాడి చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ దారుణ సంఘటనపై అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విరుచుకుపడింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి ఈ దారుణ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లే దమ్ముందా..? అంటూ సవాల్ విసిరారు.