
Alai Balai: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రతీ ఏడాది దసరా మహోత్సవం అనంతరం బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లక్ష్మణ్, ఆచార్య కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారికి బండారు దత్తాత్రేయ సాదరంగా స్వాగతం పలికారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథుల కోసం చేసిన వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ బలయ్ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమంతో అందరితో స్నేహంగా మెలగాలని ఆయన పేర్కొన్నారు. గత 17 ఏళ్లుగా దత్తాత్రేయ నాయకత్వంలో తెలంగాణ కళలు, ఆచారాలు జ్ఞాపకం తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. దసరా పండగ ప్రజలందరికీ శుభం కలుగజేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా బండారు దత్తాత్రేయ ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. అలయ్ బలయ్ వేదిక ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది పడిందని లక్ష్మణ్ తెలిపారు.