Leading News Portal in Telugu

Zomato: జొమాటో వుమెన్ డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్


Zomato: జొమాటో వుమెన్ డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్

Zomato: దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మొత్తం గర్భధారణ సమయంలో వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పథకం గురించి Zomato చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రాకేష్ రంజన్ మాట్లాడుతూ.. అటువంటి ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా గర్భధారణ సమయంలో గిగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీనితో పాటు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళా డెలివరీ భాగస్వాములు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. ఈ బీమా ప్రయోజనాన్ని అందించడం ద్వారా వారికి ఆర్థిక భద్రత కల్పించిన వారమవుతామన్నారు.

ప్రసూతి బీమా ప్లాన్ ద్వారా వుమెన్ డెలివరీ భాగస్వాములకు ప్రయోజనాలను అందించడానికి Zomato ACKOతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 60 రోజులకు పైగా ప్లాట్‌ఫారమ్‌కి కనెక్ట్ చేయబడిన, 1000 కంటే ఎక్కువ డెలివరీలను పూర్తి చేసిన మహిళా డెలివరీ భాగస్వాములకు ఈ బీమా ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ బీమా పథకం ద్వారా ఇద్దరు పిల్లల సాధారణ లేదా సిజేరియన్ డెలివరీ ఖర్చులను కంపెనీ భరిస్తుంది. దీనితో పాటు గర్భస్రావం లేదా అబార్షన్ వంటి గర్భధారణకు సంబంధించిన సమస్యలు కూడా దీనికి జోడించబడ్డాయి. ఈ బీమా ద్వారా కంపెనీ మహిళా డెలివరీ భాగస్వాములకు సాధారణ ప్రసవానికి రూ.25,000, సిజేరియన్‌కు రూ.45,000 వరకు బీమా రక్షణ కల్పిస్తోంది. అబార్షన్, గర్భస్రావం జరిగితే మహిళలు రూ. 40,000 వరకు బీమా రక్షణ పొందుతారు.