Leading News Portal in Telugu

Janasena – TDP Coordination Meetings: జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు.. కో-ఆర్డినేటర్లను నియమించిన జనసేన


Janasena – TDP Coordination Meetings: జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు.. కో-ఆర్డినేటర్లను నియమించిన జనసేన

Janasena – TDP Coordination Meetings: వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడవాలని నిర్ణయించిన విషయం విదితమే.. ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు.. ఈ నెల 30వ తేదీన కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి మీటింగులు ఉండనున్నారు.. ఇక, ఈ నెల 31వ తేదీన విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం కానున్నారు టీడీపీ – జనసేన పార్టీల నేతలు. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరుకానున్నారు..

ఇక, జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నేతలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే జనసేన – టీడీపీ సమన్వయ సమావేశాలపై చర్చించారు.. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాలవి సూచించారు. ఈ సమావేశాల నిర్వహణను ఆయా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చూసుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టని ఐదు జిల్లాలకి కో – ఆర్డినేటర్లుగా పార్టీ సీనియర్ నేతలను నియమించింది జనసేన పార్టీ.. ఆ ఐదు జిల్లాల్లో సమన్వయ సమావేశాలను పర్యవేక్షించనున్నారు కో-ఆర్డినేటర్లు.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా – పాలవలస యశస్వి.. ఉమ్మడి విజయనగరం జిల్లా – లోకం నాగమాధవి.. ఉమ్మడి కడప జిల్లా – సుంకర శ్రీనివాస్.. ఉమ్మడి కర్నూలు జిల్లా – చింతా సురేష్.. విశాఖ అర్బన్ జిల్లా – కోన తాతారావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది జనసేన.