Samajika Sadhikara Yatra Day 2: వైసీపీ సామాజిక సాధికార యాత్ర.. రెండో రోజు ఎక్కడ.. ఎవరు పాల్గొంటారంటే..!

Samajika Sadhikara Yatra Day 2: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్రలు చేపట్టింది.. ఒకే సారి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఈ యాత్రలు నిర్వహిస్తున్నారు.. మంత్రులు, నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చేకూరిన లబ్ధిని వివరిస్తున్నారు.. తొలి రోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్రలు దిగ్విజయంగా సాగగా.. రేపు అనగా రెండో రోజులో భాగంగా శుక్రవారం రోజు మూడు ప్రాంతాల్లో ఈ యాత్రలు సాగనున్నాయి.
ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గంలో రేపు సామాజిక సాధికార యాత్ర జరగనుంది.. ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఉదయం 10.30 గంటలకు విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు.. ఉదయం 11.30 కు విజయనగరం నుంచి గొట్లం గ్రామం వరకు బైక్ ర్యాలీ ఉండనుండగా.. నాడు నేడులో అభివృద్ధి చేసిన స్కూల్‌ను పరిశీలిస్తారు.. గొట్లం సచివాలయాన్ని సందర్శిస్తారు.. ఇక, మధ్యాహ్నం మూడు గంటలకు గజపతినగరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు..
ఇక, కోస్తాంధ్ర విషయానికి వస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గంలో రేపు సామాజిక సాధికార యాత్ర చేపట్టనున్నారు.. మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్, సిదిరి అప్పల రాజు, ఇతర నేతలు పాల్గొంటారు.. మధ్యాహ్నం 1 గంటకు మొగల్తూరు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం, స్థానిక నేతలతో సామూహిక భోజనాలు ఉంటాయి.. మధ్యాహ్నం 3 గంటలకు రామన్న పాలెంలో బీసీ వర్గాలతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించనున్నారు.. సాయంత్రం 4 గంటలకు ఎల్బి చెర్ల దగ్గర రైతు, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో భేటీ కానున్నారు నేతలు.. సాయంత్రం ఐదు గంటలకు నర్సాపురంలో పబ్లిక్ మీటింగ్ ఉండనుంది.
మరోవైపు.. రాయలసీమ విషయానికి వస్తే.. తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గంలో రేపు సామాజిక సాధికార యాత్ర జరగనుంది.. విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, మార్గాని భరత్, ఇతర నేతలు పాల్గొంటారు.. ఉదయం 9 గంటలకు జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర పూలే విగ్రహానికి నివాళులర్పించనున్నారు.. బాలాజీ కాలనీ నుంచి వైఎస్ఆర్ మార్గ్ వరకు మూడున్నర కిలో మీటర్ల పాదయాత్ర సాగనుంది.. మధ్యాహ్నం 1 గంటకు కొత్తపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భోజన విరామం ఉండగా.. రామానుజ సర్కిల్ నుంచి తుడా వరకు పాదయాత్ర సాగిస్తారు.. ఇక, సాయంత్రం 4.30 కు టాటా నగర్ లోని పెదకాపు వీధిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు్న్నారు వైసీపీ నేతలు.