Leading News Portal in Telugu

Actor Rajkumar Rao: ఈసీ నేషనల్‌ ఐకాన్‌గా బాలీవుడ్‌ స్టార్ రాజ్‌కుమార్‌ రావు


Actor Rajkumar Rao: ఈసీ నేషనల్‌ ఐకాన్‌గా బాలీవుడ్‌ స్టార్ రాజ్‌కుమార్‌ రావు

Actor Rajkumar Rao: భారత ఎన్నికల సంఘం గురువారం (అక్టోబర్ 26) నటుడు రాజ్‌కుమార్ రావుకు కీలక బాధ్యతను అప్పగించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రాజ్‌కుమార్‌రావును కమిషన్ జాతీయ ఐకాన్‌గా నియమించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున జాతీయ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్న నేషనల్ ఐకాన్‌లలో ఒకరిగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు నియమితులయ్యారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు రాజకుమార్‌ రావు ఓటరు విద్య, ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ఎన్నికల కమిషన్‌తో ఎంఓయూపై సంతకం చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ ఎంవోయూ మార్చుకున్నారు. రాజ్‌కుమార్‌ రావు ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌ వాస్తవ్యుడు కావడం గమనార్హం.

ఎక్కువ మంది ఓటర్లను ఎన్నికలలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, ఎన్నికల సంఘం ప్రముఖ భారతీయ వ్యక్తులను జాతీయ చిహ్నాలుగా నియమిస్తుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం అధికారికంగా రాజ్‌కుమార్ రావును ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్‌గా నియమించారు. గతంలో ప్రముఖ నటులు పంకజ్‌ త్రిపాఠి, అమీర్‌ఖాన్‌, క్రీడాకారులు సచిన్‌ టెండూల్కర్‌, ఎం.ఎస్‌.ధోని, మేరీకోమ్‌ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్‌లుగా వ్యవహరించగా.. తాజాగా రాజ్‌కుమార్‌ నియమితులయ్యారు. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు గురించి తెలియని వారుండరు. వర్సటైల్ సినిమాలు చేస్తూ.. తన నటనతో ప్రేక్షకులను అలరించే రాజ్‌కుమార్ తాజాగా ఈసీ జాతీయ ఐకాన్‌గా నియమితులయ్యారు. హిందీ మూవీ ‘న్యూటన్‌’లో ఎన్నికల అధికారి పాత్ర పోషించారు రాజ్‌కుమార్. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్రతో అదరగొట్టాడు. ఈ పాత్రలో తన నటనకుప్రశంసలు అందుకున్న రాజ్‌కుమార్‌ రావ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) జాతీయ ఐకాన్‌గా నియమించింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు పొందిన ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్‌ అవార్డుల ఎంపికకు అధికారిక నామినేషను కూడా పొందిన సంగతి తెలిసిందే.