Leading News Portal in Telugu

Ayodhya Ram Mandir: రామున్ని నమ్మని వారికి ఇదే గతి.. సంజయ్ రౌత్‌కి ఆలయ పూజారి కౌంటర్..


Ayodhya Ram Mandir: రామున్ని నమ్మని వారికి ఇదే గతి.. సంజయ్ రౌత్‌కి ఆలయ పూజారి కౌంటర్..

Ayodhya Ram Mandir: ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడుతారని ఆయన అన్నారు. ఎంపీ, శివసేవ(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. సంజయ్ రౌత్ కేవలం ఎన్నికలను మాత్రమే చూడగలరని.. విగ్రహ ప్రాణప్రతిష్ట అనేది విశ్వాసం, భక్తికి సంబంధించిందని అందుకే ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించామని ఆయన అన్నారు. గతంలో భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా ఆయన వచ్చారని ఆచార్య సత్యేంద్ర దాస్ గుర్తు చేశారు.

ప్రస్తుతం ఆలయం దాదాపుగా నిర్మించబడింది, విగ్రహ ఏర్పాటు జనవరి 22న నిర్వహించబడుతుంది, ప్రధాని మంత్రిని ఆహ్వానించాం, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని అన్నారు. ఇది కేవలం త్యాగాల గురించి కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిందని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీకి శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని, అందుకే ఆయన అధికారంలో ఉన్నారని, రాముడి ఉనికిని నిరాకరించిన వారు వీధుల్లో తిరుగుతున్నారని, అలాగే కొనసాగుతారని దాస్ అన్నారు. ‘‘ రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించింత వరకు అవి వస్తాయి, పోతాయి, అయితే శ్రీరాముడి ఆశీస్సులు ప్రధాని మోడీకి ఉన్నాయని అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన అధికారంలో ఉన్నారు. అలాగే కొనసాగుతారు. రాముడిని వ్యతిరేకించే వారు వీధుల్లోనే ఉంటారు’’ అని దాస్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మణిపూర్ తప్ప ఎక్కడికైనా వెళ్తారు, ఆయనను ప్రత్యేకంగా అయోధ్యకు ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద ఈవెంట్ ను ఎవరైనా ఎందుకు వదిలేస్తారు..? మణిపూర్ తప్పా, ఇజ్రాయిల్, గాజా కూడా వెళ్లొచ్చు అంటూ సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. అయోధ్య రామమందిరం పార్టీ కార్యక్రమంగా మారుతుందా..? దేవుడు అందరికి చెందిన వాడు, ప్రతీ పార్టీకి ఆహ్వానం అందాలి, ఒకపార్టీకి ఆహ్వానం పంపడమేంటని ప్రశ్నించారు.