
యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం దామెరలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు, పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినా.. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే అంటూ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడం మంచి పరిణామం.. సీపీఎం, సీపీఐ మద్దతుతో భారీ మెజార్టీతో మునుగోడులో నేను గెలవబోతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకుడు.. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో టికెట్ చేజారింది.. అధిష్టానం సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.. ఆ హామీని నిలబెట్టుకోవాలి అని ఆయన కోరారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు టికెట్ నాదే, భారీ విజయం నాదే అంటూ చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దని కోరినట్లు చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఈసారి మునుగోడు నియోజకవర్గం వదిలిపెట్టి రాష్ట్రంలో మరోచోట నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, నారాయణపురం మండలం దామెరలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన చలమల్ల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి స్వాగతిస్తున్నాను అని తెలిపారు. క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని గత 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నానని కార్యకర్తలు అధైర్య పడొద్దని.. టికెట్ తనకే వస్తుందని చలమల కృష్ణారెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.