Leading News Portal in Telugu

Ambati Rambabu: చంద్రబాబుకు బెయిల్‌ వచ్చే ఐడియా చెప్పిన అంబటి.. ఆ ఒక్క పని చేస్తే చాలు..


Ambati Rambabu: చంద్రబాబుకు బెయిల్‌ వచ్చే ఐడియా చెప్పిన అంబటి.. ఆ ఒక్క పని చేస్తే చాలు..

Ambati Rambabu: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన భద్రతపై ఆది నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. అయితే, తాజాగా, తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాయడం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. కానీ, చంద్రబాబు లేఖపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. ఇదే సమయంలో.. చంద్రబాబుకు వెంటనే బెయిల్‌ వచ్చే ఓ ఐడియా కూడా చెప్పుకొచ్చారు..

ఓవైపు చంద్రబాబుకు ఆరోగ్యం బాగో లేదని అంటున్నారు.. మళ్లీ ప్రాణహాని ఉందని అంటున్నారు.. ఈ రెండు వాదనలు గందరగోళంగా ఉన్నాయన్నారు మంత్రి అంబటి రాంబాబు.. బెయిల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం కోసమే ఈ ఆందోళనలు అని నా అభిప్రాయం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, చంద్రబాబుకు అంబటి ఓ ఉచిత సలహా ఇచ్చారు.. ఒక పని చేస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. విదేశాలకు పంపించిన తన మాజీ పీఏ శ్రీనివాస్ ను వెనక్కి పిలిపించాలని.. శ్రీనివాస్ వెనక్కి వస్తే.. చంద్రబాబుకు వెంటనే బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అతన్ని విచారించాల్సిన అవసరం ఉందని.. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.