Leading News Portal in Telugu

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో  నిందితుడికి పదేళ్ల శిక్ష ఖరారు


posted on Oct 27, 2023 12:22PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు మరో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ కు శిక్ష పడింది. ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు అతనిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఈ కేసులో శిక్ష పడిన వారి సంఖ్య ఐదుకి పెరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ 11 మందిని అరెస్ట్ చేయగా, నలుగురికి ఇదివరకే శిక్ష పడింది. 

సయ్యద్ మక్బూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై అతడిని 2013 ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. పాకిస్థాన్, భారత్ లోని ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులతో అతడు క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతూ కుట్రలో భాగమయ్యాడని ఎన్ఐఏ తన చార్జిషీటులో పేర్కొంది.

2012లో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ 11 మందితో కూడిన గ్యాంగ్.. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చింది.