
సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలోని వట్ పల్లి మండలం పోతులబొగూడలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే నయవంచన, ఓ నాటకం.. కేసీఆర్ అంటే నమ్మకం.. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్.. తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు ఆగం చేయాలని చూస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనున్న కర్ణాటక పరిస్థితులే.. కాంగ్రెస్ అంటేనే ఝూటాకోర్ పార్టీ.. 2009లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అంటూ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లను నమ్మితే మోసపోతాం.. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోంది.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం దండగ చేస్తే.. కేసీఆర్ పండుగ జేసిండు అని ఆయన అన్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ మంచి మెజార్టితో గెలుస్తామని అంటున్నాయి.. పనితనం తప్ప, పగతనం తెలియని నాయకుడు కేసీఆర్.. లేదంటే కాంగ్రెస్ వాళ్ళు సగం మంది జైల్లో ఉండేవారు అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఇక, నాడు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వెళ్తే.. నేడు వలసలు వాపస్ అయ్యాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేస్తుంది.. కళ్ళ ముందు, ఇంటి ముందు కనిపించిన అభివృద్ధిని నమ్మాలి అని ఆయన తెలిపారు. మోసపోతే, గోస పడతాం అని చెప్పుకొచ్చారు.