Leading News Portal in Telugu

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!


IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!

Hardik Pandya Injury is impact on India team’s composition: స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ జట్టులోకి వచ్చే వరకు కూర్పు పరంగా జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. పేస్‌ బౌలింగ్‌ను బలోపేతం చేయడం కోసం శార్దూల్‌ ఠాకూర్‌పై వేటు వేసి.. మొహ్మద్ షమీని తీసుకోవాల్సి వచ్చింది. అలానే బ్యాటింగ్ బలోపేతం కోసం సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆడించారు. షమీ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. సూర్య కీలక సమయంలో రానౌట్ అయి నిరాశపరిచాడు.

ఇక ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. లక్నోలో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్‌గా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంచుకోవడంపై భారత్ మేనేజ్మెంట్ దృష్టిసారించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. స్పెషలిస్టు పేసర్లను ఇద్దరికి పరిమితం చేయాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొహ్మద్ సిరాజ్‌, మొహ్మద్ షమీలలో ఒకరే ఆడుతారు. సిరాజ్‌, షమీలలో ఎవరిని ఎంచుకోవడం అంటే తలనొప్పే.

మొహ్మద్ సిరాజ్‌ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్‌ పేసర్‌గా ఉన్నాడు. అయితే మొహ్మద్ షమీ గత మ్యాచ్‌లో చెలరేగాడు. దాంతో ఎవరి వైపు మొగ్గుచూపాలో కెప్టెన్, కోచ్‌కు ఇబ్బందే. ఇద్దరు పేసర్లను మాత్రమే తీసుకోవడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. హార్దిక్‌ పాండ్యా ఉంటే మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో చేయడమే కాక.. మూడో పేసర్‌గా ఉండేవాడు. భారత్ 4 మ్యాచ్‌లలో ఈ కూర్పుతోనే బరిలోకి దిగింది. ఇప్పుడు హార్దిక్‌ లేకపోవడంతో పెద్ద సమస్యగ మారింది. ఆర్ అశ్విన్‌ను ఆల్‌రౌండర్‌గా భావించి.. ముగ్గురు పేసర్లను ఎంచుకుంటే ఎలా ఉంటుందనే వాదన కూడా ఉంది. అయితే ఆ సందర్భంలో బ్యాటింగ్‌ బలహీన పడే ప్రమాదం ఉంది. టోర్నీలో ఘోర పరాజయాలు చవిచూస్తున్న ఇంగ్లండ్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దాంతో భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందో చూడాలి.