Leading News Portal in Telugu

Software Dead: కారు టైరు పేలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి!


Software Dead: కారు టైరు పేలి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి!

TCS Software employee dies in Car Accident: రన్నింగ్ కారు టైరు పేలి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన బొంగుళూరు ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై జరిగింది. దసరా పండగకు సొంతూరికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరానికి చెందిన మురళీకృష్ణ వరప్రసాదరావు (51) గచ్చిబౌలి టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. దసరా పండుగకు ఇటీవల మురళీకృష్ణ తన సొంతూరు విజయనగరంకు కుటుంబంతో వెళ్లాడు. పండగ అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బొంగుళూరు ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై కారు టైరు పేలింది. దాంతో కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టింది.

కారు డ్రైవింగ్‌ చేస్తున్న మురళీకృష్ణ వరప్రసాదరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి తండ్రి లక్ష్మణరావు, భార్య నీలవేణి, కుమారుడు నెహంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మురళీకృష్ణ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మురళీకృష్ణ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.