Leading News Portal in Telugu

బిజెపి తీరుపై బాబూ మోహన్  ఫైర్…  ఈ ఎన్నికలకు దూరమని ప్రకటన


posted on Oct 28, 2023 4:00PM

సినిమాల్లో కమెడియన్ పాత్రల నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బాబూమోహన్ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా? బిజెపి ప్రకటించిన రెండు జాబితాలో తన పేరు రాకపోవడంతో ఆయన రోడ్డెక్కారు. పార్టీ తనను అవమాన పరుస్తుందని, పైగా తన కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ప్రకటనలు చేస్తుందని బాబు మోహన్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో చెప్పారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీలో 1999 ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రయ్యారు. తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థిగా 2004,2014 ఎన్నికల్లోపోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తనకు టిఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బాబూ మోహన్ బిజెపిలోకి జంప్ అయి టికెట్ సంపాదించారు. టిఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు.ఈ ఎన్నికల్లో బిజెపి  ఆందోల్ టికెట్ కేటాయించకపోవడంతో  బాబు మోహన్ బిజెపికి, ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 

తన పాపులారిటీ గురించి తెలియదా? తానెవరో తెలియదా? తనను ఎన్నో జాబితాలో పెడతారు? అయినా తాను ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకున్నానని  బాబూ మోహన్ అన్నారు. తన పేరు మొదటి, రెండో జాబితాలో లేకపోవడంపై ఆయన పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదన్నారు. బీజేపీకీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఫోన్ చేసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తున్నామని చెబుతూ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధిష్ఠానం స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు.

వరుస జాబితాల పేరుతో దాపరికం తనకు నచ్చడం లేదన్నారు. పార్టీ రాష్ట్ర పెద్దలు కావాలని తనను పక్కన పెడుతున్నట్లుగా అనిపించిందన్నారు. టిక్కెట్ ఎవరికైనా ఇచ్చుకోనీయండి.. మా అబ్బాయికి అంటున్నారు.. నా కొడుక్కే ఇవ్వండి.. కానీ అది తనకు నేరుగా చెప్పాలి కదా? అని బాబూ మోహన్ ప్రశ్నించారు. నాన్చుడు ధోరణి సరికాదన్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని అని, అలాంటి తనను ఎన్నో జాబితాలో పెడతారని ప్రశ్నించారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పార్టీలో ఉండాలా? రాజీనామా చేయాలా? చూస్తానన్నారు.