
Mahua Moitra: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో మహూవా మోయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేశారు. దీనిపై పార్లమెంట్ స్పీకర్ కి లేఖ రాశారు. మరోవైపు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను సదరు వ్యాపారవేత్తకు ఇచ్చారని, దీనిపై కూడా దర్యాప్తు చేయాలని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. ఆమె పార్లమెంట్ లో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు గౌతమ్ అదానీపైనే ఉన్నాయని, ఈ విషయంలో ప్రధానిని విమర్శించేందుకే ఇలా చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ కేసులో సంచలన విషయాన్ని బయటపెట్టింది ఎంపీ మహువా మోయిత్రా. పార్టమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను దర్శన్ హీరానందానీకి ఇచ్చినట్లు అంగీకరించింది. తాను లోక్ సభలో అడిగే ప్రశ్నల్ని టైప్ చేయడానికి ఇచ్చినట్లు ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులను, గిప్టులను లంచంగా తీసుకున్నారనే ఆరోపణల్ని తోసిపుచ్చారు. సదరు వ్యాపారవేత్తను ప్రశ్నించడానికి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లాగిన్ వివరాలు ఇచ్చిన విషయాన్ని ఆమె సమర్థించుకున్నారు. తాను మారుమూల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకనే ఈ వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనకు ఓటీపీ వస్తుందని, నా ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని చెప్పారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లు నిర్వహించే ఎన్ఐసీ దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని చెప్పారు.
హీరానందానీ తన స్నేహితుడని, తన పుట్టిన రోజున ఒక స్కార్ఫ్, లిప్‌స్టిక్ , మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు చెప్పారు. దుబాయ్ లో పన్నులు లేని ఓ డ్యూటీ ఫ్రీ షాపులో ఇవి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇక బంగ్లా ఆధునీకీకరణ గురించి మాట్లాడుతూ.. తాను వెళ్లే సరికే బంగ్లా పాతబడిందని, అందుకే ఇంటీరియర్ గురించి సలహాలు తీసుకునేందుకు దర్శన్ ని సంప్రదించానని, నాకు కొత్త ఆర్కిటెక్చర్ కి సంబంధించిన డ్రాయింగ్ ఇచ్చారని, ప్రభుత్వం పరిధిలోని సీపీడబ్ల్యూడీ ఇంటీరియర్ పని పూర్తి చేసినట్లు తెలిపింది. దర్శన్ నాకేదైనా ఇచ్చి ఉంటే వెల్లడించాలని, వాటిని నిరూపించాలని, అఫిడవిట్ లో రూ. 2 కోట్లు ఇచ్చినట్లు లేదని, ఒక వేళ ఇస్తే ఆ తేదీ, అందుకు సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని మహువా మోయిత్రా డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ మహువా మోయిత్రాకు సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను విచారించింది. మరోవైపు ఈ ఆరోపణలపై ఎథిక్స్ కమిటీకి దర్శన్ హీరానందానీ అఫిడవిట్ సమర్పించారు. అందులో మహువా తన నుంచి గిఫ్టులు తీసుకుందని, చేయకూడని పనులు చేయించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31 న మహువాను తమ ముందు హాజరు కావాలని ఎథిక్స్ కమిటీ ఆదేశించింది. అయితే తనకు కొంత సమయం కావాలని చెప్పడంతో నవంబర్ 2న రావాలని తెలిపింది.