Leading News Portal in Telugu

Miniter Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళింది..


Miniter Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళింది..

Miniter Harish Rao: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని ఆయన అన్నారు. అవినీతిపరుల పార్టీగా మారిందని మంత్రి విమర్శలు గుప్పించారు. నోటుకు ఓటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడని మంత్రి హరీష్ పేర్కొన్నారు. ఓ ఎంపీ ద్వారా ఇచ్చాడని ఆరోపణలున్నాయన్నారు.

ఐదు కోట్లు, పదెకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని మంత్రి ఆరోపించారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సగం సీట్లలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని.. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కాంగ్రెస్‌లో ఉందన్నారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరు అని.. మాటలు ఎక్కువ చేతలు తక్కువ అంటూ హరీష్‌ రావు ఎద్దేవా చేశారు.

బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుందన్నారు. కడియం శ్రీహరి, రాజన్న నాయకత్వంలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్‌ను గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు. రాజన్నకు భవిష్యత్తు ఉందని.. ఆయన అనుచరులు ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.