
Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే ప్రజల కలలు నిజమవుతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమే ఈ ఎన్నికలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే రాష్ట్ర ప్రజల కలలు నెరవేరుతాయన్నారు. తెలంగాణ సంపద ప్రజలందరికీ పంచడానికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తాం. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తాం. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. మద్దతు ధరపై అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాం. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తాం. అద్భుతమైన సమాజ నిర్మాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ లోతైన ఆలోచన చేసి విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు గ్యారెంటీ ఇస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరని తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. యువ వికాసంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. 15 ఎకరాలకు తగ్గకుండా ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పిస్తాం. చేయూత పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 4000 రూపాయల పింఛన్ ఇస్తాంగృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పిస్తాం. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు పరుస్తాం.”అని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఐఐటి కళాశాల మెడికల్ కళాశాల తీసుకువచ్చిన ఘనత జగ్గారెడ్డిదేనని ఆయన అన్నారు. ప్రజల మనిషిగా ప్రజల కోసం పనిచేస్తున్న సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిని ఈ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.