
లోకేష్ కామెంట్స్ పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్ ఇచ్చారు. చంద్రబాబు స్కామ్ పై రుజువులు న్యాయస్థానంకు ఇస్తాం కానీ.. నీలాంటి దొంగలకు కాదని లోకేశ్ పై మండిపడ్డారు. 13చోట్ల చంద్రబాబు సంతకం పెడితే అంత కంటే ఇంకేమి రుజువు కావాలని ప్రశ్నించారు. సీమెన్స్ సంస్థ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమన్నారు. న్యాయస్థానాలకు నాలుగు వేల పేజీలు నివేదిక, 130 మంది వాంగ్మూలాలు నమోదు చేసిందని తెలిపారు. కోర్టుకు వెళ్లి 17(ఏ) గురించి నువ్వు, నీ తల్లి, నీ పార్టీ చెంచాలు అడుగుతారే తప్ప తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు.
చంద్రబాబు 50 రోజులుగా జైల్లో ఉంటే లోకేష్ బయటకు వచ్చి అరుపులు, కేకలు పెడుతున్నాడని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలో చంద్రబాబును మించినోడు లేడని ఆరోపించారు. NTR ట్రస్ట్ ఆస్తులు చంద్రబాబుకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కుంభ కోణాల నుంచి తప్పించుకుని తిరగడం ఎదుర్కోలేదని… చంద్రబాబు మొదటి నుంచి దొంగే….దొంగ పనులు చేయడం అలవాటని అన్నారు. పాముల్ని పట్టే వాడు పాముకాటుకి చచ్చిపోయినట్టు ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు రాజకీయం అంతా మేనెజ్మెంట్.. ఈవెంట్ మేనెజ్ మెంట్లేనన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టేందుకు వ్యవస్థలను చంద్రబాబు మ్యానేజ్ చేశాడని తెలిపారు. ఏసీ పెట్టిన తర్వాత జైల్లో చంద్రబాబుకి దోమలు కూడా కుట్టడం లేదు హ్యాపీగా వున్నాడని.. చంద్రబాబుకు ముప్పు జరిగితే అది లోకేష్ వల్లే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. వెన్నుపోటు రక్తం పంచుకుని పుట్టిన వ్యక్తిగా లోకేష్.. తన భవిష్యత్ కోసం ఏదైనా చేస్తాడనేదే మా అనుమానమని అన్నారు.