Leading News Portal in Telugu

తెలంగాణలో పోటీకి తెలుగుదేశం దూరం! | tdp away from telangana assembly elections| kasani| babu| mulakhat


posted on Oct 30, 2023 9:55AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నుంచి తెలుగుదేశం తప్పుకుంది. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం కోసం ఖమ్మం సభతో శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ పరిస్థితులన్నీ సానుకూలమైన తరువాత హఠాత్తుగా పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ఆ పార్టీకి ప్రజాభిమానం వెల్లువలా పోటెత్తినా.. ప్రస్తుత పరిస్థితుల్లో  తెలంగాణలో పార్టీని సమన్వయం చేయడం, అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగినా ప్రచారం చేయడానికి, అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై కాన్సట్రేట్ చేసే పరిస్థితి లేదన్న అభిప్రాయానికి వచ్చిన పార్టీ అధినేత ఈ సారికి పోటీకి దూరంగా ఉండటమే మేలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని శనివారం(అక్టోబర్ 28) రాజమహేంద్రవరంలో తనను ములాఖత్ ద్వారా కలుసుకున్న కాసాని జ్ణానేశ్వర్ కు తెలియజేశారు. అధినేత నిర్ణయాన్ని కాసాని ఆదివారం (అక్టోబర్ 29) హైదరాబాద్ లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అధినేత అరెస్టు, రాష్ట్రంలో పార్టీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం కారణంగా ఆయన ఉద్వేగానికి లోనైనట్లు కనిపించింది. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అయితే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ గుర్తుతో పోటీకి అనుమతిస్తే.. అన్నీ తామే చూసుకుంటామనీ, పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని వారి సందర్భంగా ఉద్వేగంగా చెప్పారు. ఈ విషయంలో ఒక సారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో సంప్రదించాలని కాసానిని కోరారు. ఈ మేరకు అక్కడికక్కడే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టారు. 

దాదాపు ఏడాదిన్నర కిందట తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామంటూ నారా చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన ప్రజాదరణ చూసి రాజకీయ పార్టీలే ఆశ్చర్యపోయాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణను, ప్రతిష్టను, బలాన్ని అప్పటి వరకూ తక్కువ అంచనా వేసిన పార్టీలు తమ వైఖరి మార్చుకున్నాయి. ఖమ్మం సభ తరువాత హైదరాబాద్ లో మరో సభ నిర్వహించి సత్తా చాటిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ.. అక్కడ నుంచీ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై దృష్టి సారించింది. తెలుగుదేశంలోకి చేరికలు పెరిగాయి.  విభజన తరువాత వివిధ కారణాలతో పార్టీని వీడి వెళ్లిన తెలంగాణ నేతలంతా సొంత గూటికి చేరుతారన్న అంచనాలు పెరిగాయి.

తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పూర్వవైభవం సంతరించుకుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనకు గురయ్యాయి.  ఈ సారి తెలంగాణలో తెలుగుదేశం కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని అంతా భావించారు. ఇంత కాలం తెలుగుదేశం ఓటు బ్యాంకుతో అధికారాన్ని అనుభవిస్తున్న అధికార బీఆర్ఎస్ లో అన్ని పార్టీల కంటే ఎక్కువ ఆందోళన వ్యక్తం అయ్యింది. 

సరిగ్గా ఈ సమయంలోనే ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసింది. దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి ఒక్క సారిగా అగమ్యగోచరంగా మారిపోయింది.  చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో  వెల్లువెత్తిన నిరసనలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అధికార బీఆర్ఎస్ పై జనంలో ఆగ్రహం పెల్లుబికింది. దాంతో పరిస్థితిని గమనించిన కేటీఆర్ గొంతు సవరించుకున్నారు. చంద్రబాబు  అరెస్టును ఖండించారు. 

ఇక బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు పలువురు చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాకుండా.. ఆయన అరెస్టును నిరసిస్తూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు

 చంద్రబాబు క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లు కోర్టుల్లో  వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బయటకు రాకుండా చేస్తున్నారన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అగ్ర నేతలంతా.. చంద్రబాబు న్యాయపోరాటానికి సంబంధించి అంశాలలోనూ, అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలో  నిరసన కార్యక్రమాలలోనూ, అలాగే ఓటర్ల జాబితాలోని అవకతవకలను వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకురావడంలోనూ నిమగ్నమైపోయారు. ఈ నేపథ్యంలో సరిగ్గా నెల రొజులలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం లేకపోవడంతో పోటీ నుంచి వైదొలగడమే మేలని పార్టీ నిర్ణయానికి వచ్చింది.