posted on Oct 30, 2023 5:13PM
రాజన్న ముద్దు బిడ్డ జగన్‌ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు ఆ రాజన్న భార్య విజయమ్మ, కుమార్తె వైయస్ షర్మిల.. పెద్ద యజ్జమే చేశారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. జగనన్ను ముఖ్యమంత్రి యోగం పట్టించేందుకు పెద్ద యాగమే చేశారు. అదీ కూడా ఎంతగా అంటే జగన్.. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉంటే.. జగనన్న వదిలిన బాణమంటూ.. సోదరుడి కోసం రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వారి తల్లి విజయమ్మ సైతం అడుగు కలిపారు.
అలాగే ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ సైతం పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో వైయస్ జగన్‌కి షర్మిల, వైయస్ విజయమ్మ అండ.. దండ గా నిలిచారు. అంతేకాదు.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల వారితో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించి.. తన బావమరిది, వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్ర పరిస్థితులు ఏమో కానీ ముఖ్యంగా మన స్థితిగతులు మారిపోతాయని.. వారికి ఎరేసి మరి చెప్పారు. అలా వారితోపాటు కాలం కూడా జగన్‌కి కలిసొచ్చింది. 2019 ఎన్నికల పలితాల్లో జగన్ పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. దీంతో జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశారు.. దీంతో జగన్ బాబు.. జగన్ బాబు అంటూ పలికే ఆయన కన్నతల్లి విజయమ్మ, జగనన్న జగనన్న అనే వైయస్ షర్మిల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.
కానీ వారి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సీఎం జగన్ అనిపించుకొన్న కొద్ది రోజులకే.. విజయమ్మ, షర్మిల పక్క రాష్ట్రానికి పయనమయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్సా టీపీ అంటూ కొత్త పార్టీని షర్మిల స్థాపించినా.. ఆ పార్టీని.. షర్మిలను జగన్ నిరాదరణకు గురి చేసిశారు. అలాగే షర్మిల పార్టీని తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా.. ప్రజలు పట్టించుకోకపోవడంతో.. ఆ పాదయాత్రకు వైయస్ షర్మిల పెట్టేశారు..
తాజాగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగడంతో.. ఈ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామంటూ షర్మిల ప్రకటించిన విషయం విదితమే. దాంతో పార్టీలో నేతలు లేరు, కేడరూ లేదు. అలాంటి పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటూ.. ఆమె కన్న తల్లి విజయమ్మ ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ప్రముఖ సిద్దాంతి అద్దేపల్లి హనుమంతరావు నివాసానికి చేరుకొని.. షర్మిల రాజయోగంపై ఆరా తీశారు. అనంతరం స్థానిక శాసన సభ్యుడు, సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకొని… యోగ క్షేమాలు ఆరా తీశారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరిపై బాలినేని.. తన కుటుంబ సభ్యుల సమక్షంలో విజయమ్మకు వివరించే ప్రయత్నం చేశారు. అంతలోనే మాట అందుకొన్న వైయస్ విజయమ్మ.. తనతో వైయస్ జగన్ సరిగ్గా మాట్లాడడమే లేదని.. తనను, షర్మిలను అసలు పట్టించుకోవడం లేదంటూ బాలినేని ఫ్యామిలీ ఎదుటే ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాలినేని సైతం తన పట్ల సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై విజయమ్మకు వివరించడంతో.. ఇద్దరూ తమకు జరుగుతున్న అన్యాయం, అవమానం ఒకరికొకరు ఏకరువు పెట్టుకొన్నట్లు పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి.. అవుతున్నాయి.
దీంతో నెటిజనులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగనన్నను అందలం ఎక్కిస్తే.. ప్రజలకే కాదు మనకు సైతం అందకుండా పోయాడని వారు పేర్కొంటున్నారు. విశ్వసనీయత, మాటతప్పం, మడమ తిప్పం లాంటి సెంటిమెంట్ డైలాగులు వాడే జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొన్నారని వారు వ్యంగ్యంగా అంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్.. సభల్లో, బహిరంగ సభల్లో స్టేజీలెక్కి అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు అంటూ షిక్కటి చిరునవ్వుతో చెప్పే మాటలన్నీ వట్టి కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని అంటున్నారు.
అయినా జగనన్న కోసం అంతలా పాదయాత్ర చేస్తే.. ఆ తర్వాత సొంత చెల్లినే దూరం పెట్టిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలంటూ నెటిజన్లు.. సోషల్ మీడియాలో పదాలు కోసం వెతుక్కోవడం గమనార్హం. ఆస్తి తగాదాలు, నామినేటేడ్ పోస్టులు వంటి వాటి వల్ల సొంత చెల్లిని దూరం పెట్టాడంటే అనుకోవచ్చు. కానీ కన్నతల్లి వైయస్ విజయమ్మని సైతం ఈ జగనన్న పట్టించుకోవడం లేదంటే.. మహానేత, తండ్రి రాజశేఖరరెడ్డి గుండెల మీద సీఎం జగన్ తన్నినట్లే అన్న ఓ ప్రచారం సోషల్ మీడియలో జోరందుకొంది. ఇక అధికారం.. అధికారం.. అధికారం.. ఈ అధికారం అనే అందలం ఎక్కగానే…. అప్పటి వరకు సాయం చేసిన వాళ్లని.. సాయపడిన వాళ్లని.. మరిచిపోతారా? అనే సందేహం సైతం నెటిజనులలో వ్యక్తమవుతోంది.