Leading News Portal in Telugu

తెలుగుదేశంకు కాసాని రాజీనామా | kasani resigns telugudesham| ttdp| telangana| elections| contest| party


posted on Oct 31, 2023 6:45AM

తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.   తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంతా సిద్ధం చేసుకున్నాక.. పోటీ చేయొద్దని చంద్రాబాబు నిర్ణయించడం తనను బాధించిందని కాసాని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేయడం లేదని తాను కార్యకర్తలకు చెప్పలేననీ, అన్ని విధాలుగా ఎన్నికలకు వారిని సన్నద్ధం చేసిన తరువాత పోటీ లేదంటూ వారికి ముఖం చూపలేకే   రాజీనామా చేశాననీ తెలిపారు.  

ఈసారి పోటీ చేయాల్సిందే అని తెలంగాణలోని పార్టీ కేడర్ మొత్తం కోరుతోందని పేర్కొన్నారు. ఇలా ఉండగా కాసాని గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనీ, తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయకపోవడాన్ని సాకుగా చూపి రాజీనామా చేశారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, కాసాని ఏ పార్టీలో చేరతారో అని ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 

అంతే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గంపగుత్తగా బీఆర్ఎస్ కు కట్టబెట్టేసేందుకు కాసాని జ్ణానేశ్వర్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఏఎస్ రావు ఆరోపించారు. తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయదన్న చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ కు చెప్పడానికి అన్న సాకుతో ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేక సమావేశంగా కాసాని మార్చేశారని ఆయన ఆరోపించారు.

 తెలంగాణ లో పార్టీ బలంగా లేదు. పైగా చంద్రబాబు జైలులో ఉన్నారు. ఇది పోటీ చేసే సందర్భం కాదు. అందుకే పోటీకి పెట్టి నాయకులను ఆర్దికంగా నష్టపరచకూడదన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ సారి తెలంగాణలో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారని తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు నాయకులు భావిస్తుంటే.. వారిని పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి కాసాని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.