Leading News Portal in Telugu

బిఆర్ఎస్ లో చేరిన నాగం, పిజెఆర్ తనయుడు  


posted on Oct 31, 2023 4:56PM

ఎన్నికల్లో టికెట్లు రాని అభ్యర్థులు పక్క పార్టీల వైపు చూడటం సహజం. దీన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ బిఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీష్ రావ్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని మేము వదిలేసిన వారిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది అని ఆరోపణలు చేశారు.  కానీ మంగళవారం కాంగ్రెస్ వదిలేసిన ఇద్దరు నేతలను బిఆర్ ఎస్ చేర్చుకోవడం ఆశ్చర్యం కలిగించింది.  కాంగ్రెస్ వదిలేసిన ఇద్దరు నేతలను బిఆర్ఎస్ అక్కున చేర్చుకుంది.  

 మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి  ఇవ్వాళ బీఆర్ఎస్ లో చేరారు. వారికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం, విష్ణువర్ధన్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తన మిత్రుడు నాగం, యువనేత విష్ణువర్ధన్‌లకు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నానన్నారు. నాగం జనార్దన్ రెడ్డి 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు.

తెలంగాణ, హైదరాబాద్‌లోని సామాన్య ప్రజల కోసం పోరాడిన నాయకుడు పి. జనార్దన్ రెడ్డి అన్నారు. పీజేఆర్ వ్యక్తిగతంగా తనకు మిత్రుడని చెప్పారు. అలాంటి పీజేఆర్ తనయుడు బీఆర్ఎస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డిల భవిష్యత్తు… బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ దక్కపోవడంతో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు.