Leading News Portal in Telugu

Minister Ambati Rambabu: విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు..!


Minister Ambati Rambabu: విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు..!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేటి సాయంత్రం విడుదల అయ్యారు. అయితే, స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు నిజం గెలిచింది, వస్తున్నా మీ కోసం అంటూ సంబరాలు చేసుకున్నారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబుకి వచ్చిన బెయిల్‌ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారని, దీనిపై టీడీపీ ఎందుకంత హంగామా చేస్తుందని ఆయన మండిపడ్డారు. బాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాత్రమే బెయిల్ వచ్చిందన్నారు. వస్తున్నా.. మీ కోసం కాదు..! వస్తున్నా కంటి ఆపరేషన్ కోసం అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్‌ ఇచ్చారు.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఆయన విమర్శించారు. విజనరీ లీడర్ కి.. విజన్ సరిచేసుకోమని బెయిల్ ఇచ్చారు!.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.

నిజం గెలిచింది, వస్తున్నా మీకోసం, న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని అంబటి హితవు పలికారు. అయితే, తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల ముందో, ఆ తర్వాతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టీడీపీ జెండా పీకేస్తారని ఆయన విమర్శలు గుప్పించారు.