Leading News Portal in Telugu

Sachin Tendulkar: రేపు వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ


Sachin Tendulkar: రేపు వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ

భారత మాజీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్‌‌కి మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ముందు సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. నవంబర్ 2వ తారీఖున ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌ ఆరంభానికి ముందు సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అహ్మద్‌నగర్‌కి చెందిన ప్రమోద్ కంబల్ అనే శిల్ఫి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అయితే, ఏప్రిల్ 24వ తేదీన సచిన్ టెండూల్కర్ 50వ పుట్టిన రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే, పనులు పూర్తి కావడానికి ఆలస్యం కావడంతో రేపు ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది.

ఇక, వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ స్టాండ్‌కి ముందు ఈ విగ్రహం ఉండనుంది. సచిన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే‌, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సచిన్ టెండూల్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కేల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇక, 1989 నవంబర్ 15న పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ ఆరంగ్రేటం చేశారు.

అయితే, సచిన్ టెండూల్కర్ 2013 నవంబర్ 14న ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన సచిన్.. 100 అంతర్జాతీయ శతకాలు, 164 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక, సచిన్ టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. టెస్టుల్లో 46 వికెట్లు, వన్డేల్లో 154 వికెట్లు కూడా తీశాడు. 1994లో ‘అర్జున’ అవార్డు దక్కించుకున్న సచిన్, 1997లో ‘రాజీవ్ ఖేల్‌రత్న’, 1998లో ‘పద్మశ్రీ’, 2008లో ‘పద్మ విభూషణ్’, 2013లో భారత అత్యున్నత్త పురస్కారం ‘భారత రత్న’ అవార్డును ఆయన అందుకున్నారు.

అలాగే, భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేయడం గమనార్హం. దీంతో ఈసారి ప్రపంచకప్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సచిన్ చెప్పాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఈసారి భారత జట్టు 6 గెలిచి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా తమ తర్వాత మ్యాచ్ నవంబర్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో ఆడబోతుంది.