posted on Oct 31, 2023 12:03PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే విధంగా ప్రచార సరళిని కొనసాగిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనాయకులు. వీళ్లు తలచుకుంటే జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ నల్గొండ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మంగళవారం నల్లగొండ జిల్లాలో 3 కీలకమైన బహిరంగ సభలను నిర్వహించబోతోంది. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మరోసారి బీఆర్ఎస్‌నే గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించబోతున్నారు. ఈ సభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచి నల్గొండలో వర్షం పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది.
మరోవైపు కీలక మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సీఎం కేసీఆర్ బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇప్పటికే వెల్లడికావడంతో సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై దృష్టిపెడుతున్నారు.
మూడో సారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నాల్లో ఉన్న బీఆర్ఎస్ ఒక్కో సీటును కీలకంగా భావిస్తోంది. ఈ కారణంగానే తమ అభ్యర్థులపైనే పూర్తిగా వదిలి వేయకుండా.. అధినాయకత్వం కూడా శ్రద్ద పెడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ సీట్లలో సిట్టింగ్ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇక్కడ అభ్యర్థులను మార్చాల్సిందే అన్న డిమాండ్ అసమ్మతి నాయకుల నుంచి వచ్చింది. కానీ, సిట్టింగ్ ఎమ్మల్యేలకు బి ఫామ్ లు ఇచ్చింది. దీంతో కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మరో ముగ్గురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవరకొండలో సైతం మున్సిపల్ చైర్మన్ , మాజీ చైర్మన్, మరికొందరు సీనియర్ నాయకలు సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక విధంగా కాంగ్రెస్ లోకి వరదలా వెళ్లిపోయారు. ఇదే పరిస్థితి నల్లగొండ నియోజకవర్గంలోనూ ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ పట్టు జారిపోకుండా కాపాడేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. దీనిలో భాగంగానే నల్గొండపై దృష్టి పెట్టినట్లు విదితమవుతోంది.
మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సీనియర్ నాయకులంతా ఉమ్మడి నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నాయకుడు జానారెడ్డి మినహా మిగిలిన నాయకులు పోటీ చేస్తున్నారు. టీపీసీసీ మాజీ చీఫ్, సీడబ్ల్యూసీ సభ్యడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. సీఎల్పీ మాజీ నాయకుడు, పార్టీ సీనియర్ కుందూరు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి ఈ సారి నాగార్జున సాగర్ నుంచి బరిలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో మారు మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీలో ఉన్నారు. ఒక విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం జరగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.