Leading News Portal in Telugu

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ | intrium bail to babu in skill case| high| court| four| weeks| health


posted on Oct 31, 2023 10:58AM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌  మంజూరైంది. ఆయన నాలుగు వారాలు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిలు పిటిషన్ పై సోమవారం (అక్టోబర్ 30) వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పు మంగళవారానికి రిజర్వ చేసిన సంగతి తెలిసిందే.  చంద్రబాబు ఆరోగ్యం రిత్యా బెయిలు మంజూరు చేసినట్లు చెబుతున్నారు.

చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిలు రావడంతో ఆయన ఈ రోజు సాయంత్రానికి రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయనను నేరుగా ఆసుపత్రికి తరలిస్తారా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తీర్పు కాపీ బయటకు వచ్చిన తరువాతే ఆ విషయంపై స్పష్టత వస్తుంది.  ఇలా ఉండగా నిన్న హైకోర్టులో మధ్యంతర బెయిలుపై వాదనల తరువాత కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేస్తుందన్న విషయంలో వైసీపీ సర్కార్ కు అనుమానం వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. ఆయనను సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ లక్ష్యం మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబును ఏ3గా పేర్కొంటో మరో కేసును రెడీ చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారంటూ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే స్కిల్ కేసుతో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు నమోదు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ మరో కేసు పెట్టింది.  ఇలా బాబు పై ఒకదాని వెనుక మరొక కేసులు వేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.