Leading News Portal in Telugu

Andhra Pradesh Formation Day 2023: నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం


Andhra Pradesh Formation Day 2023: నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Andhra Pradesh Formation Day 2023: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొంటారు.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఈ సందర్భంగా తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించనున్నారు ఏపీ సీఎం.. మరోవైపు ఏపీ రాష్ట్ర అవతరన దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు పాల్గొంటారు. ఇక, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జరుగనున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతీ ఏడాది నవంబరు 1వ తేదీన జరుపుకుంటారు.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్‌గా మారింది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు. అయితే, 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గత చంద్రబాబు ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు.. కానీ, జూన్ 2న నవ నిర్మాణ దీక్షల పేరుతో నిర్వహించారు.. అయితే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.