
Delhi Liquor Case: మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈరోజు సమన్లు వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు న్యాయస్థానం ఇవాళ తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే.. మూడు నెలల్లోపు మనీష్ సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది.