Leading News Portal in Telugu

PAK v BAN: భారత్‌ చేతిలో పరాజయం తీవ్రంగా బాధించింది: ఫకర్‌ జమాన్



Fakhar Zaman

Opener Fakhar Zaman React on Pakistan Defeat vs India: వన్డే ప్రపంచకప్‌ 2023లో అన్నింటికంటే భారత్‌ చేతిలో పరాజయమే తమ జట్టును తీవ్రంగా బాధించిందని పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్‌ తెలిపాడు. భారత్‌ పిచ్‌లపై పరుగులు చేయాలంటే ముందుగా 4-5 ఓవర్లు క్రీజ్‌లో ఉండిపోవాలని, ఆ తర్వాత సులువుగా పరుగులు చేయొచ్చన్నాడు. తన గాయం పెద్దదేమీ కాదని, కానీ ముందుజాగ్రత్తగా మేనేజ్‌మెంట్‌ బెంచ్‌కే పరిమితం చేసిందని ఫకర్ జమాన్‌ స్పష్టం చేశాడు. మంగళవారం కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచింది. 87 పరుగులు చేసిన ఫకర్ జమాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పాక్ ఓపెనర్ మీడియాతో మాట్లాడాడు.

‘ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ కీలకమే. విజయం సాధిస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. బంగ్లాదేశ్‌పై విజయం మాకు చాలా ముఖ్యం. ఇలాంటి విజయం కోసం మేం ఎదురు చూశాం. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మంచి ప్రదర్శనే చేశాం. సరైన కాంబినేషన్‌ను సాధించామని భావిస్తున్నా. గత ఎనిమిది ఏళ్లుగా పాకిస్తాన్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో భాగమైపోయా. చాలా గర్వపడుతున్నా. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ను 30 ఓవర్లలోనే పూర్తిచేయాలని ముందే అనుకున్నాం. నెట్‌ రన్‌రేట్‌ మాకు చాలా కీలకం. ఎందుకంటే టోర్నీ సెమీస్‌ చేరాలంటే ఇవన్ని తప్పవు’ అని ఫకర్ జమాన్‌ చెప్పాడు.

Also Read: NZ vs SA: నేడు హై ఓల్టేజ్‌ మ్యాచ్‌.. హోరాహోరీ తప్పదా? డ్రీమ్ 11 టీమ్ ఇదే

‘నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ తర్వాత 5 మ్యాచ్‌లు ఆడలేదు. నా గాయం పెద్దదేమీ కాదు. అయితే ముందుజాగ్రత్తగా మేనేజ్‌మెంట్‌ నన్ను ఆడించలేదు. టీమ్‌కు అవసరమైన సమయంలో ఆడేందుకు నెను సిద్ధం. బంగ్లాపై ఆడే అవకాశం వచ్చింది. జట్టు విజయం కోసం నా వంతు సహకారం అందించా. భారత్‌ పిచ్‌లపై పరుగులు చేయాలంటే ముందుగా క్రీజ్‌లో కుదురుకోవాలి. ఆ తర్వాత సులువుగా పరుగులు చేయొచ్చు. వచ్చే మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా. మిగతా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే.. సెమీస్‌ అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటివరకు మేం 4 మ్యాచుల్లో ఓడిపోయాం. అయితే భారత్‌ చేతిలో పరాజయం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఎందుకంటే భారత్-పాక్‌ మ్యాచ్‌ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు చూస్తారు. మా ఆటగాళ్లందరూ విజయం కోసం తీవ్రంగా పోరాడతారు’ అని పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ తెలిపాడు.