Leading News Portal in Telugu

AP Formation Day Celebrations: క్యాంపు కార్యాలయంలో ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..


AP Formation Day Celebrations: క్యాంపు కార్యాలయంలో ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

AP Formation Day Celebrations: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్‌.. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు.. ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు రచించిన స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు పుస్తకాన్ని ఈ సందర్‌భంగా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఇక, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రులు ఆర్కే రోజా, ఉషాశ్రీ చరణ్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇక, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ సోషల్‌ మీడియాలో స్పందించారు.. అమ‌ర‌జీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి త్యాగ ఫ‌లం, ఎంతో మంది పోరాట ఫ‌లితంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నేడు వారి స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంక్షేమం, అభివృద్ధి అందించాల‌న్న స‌మున్నత ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజ‌లుగా మ‌నం బ‌ల‌ప‌డుతూ ఈ దేశాన్ని మ‌రింత బ‌ల‌ప‌రిచేందుకు ఎన్నో అడుగులు ముందుకు వేస్తున్నాం. దేశ అభివృద్ధిలో మ‌న‌వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నాం. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజ‌లంద‌రికీ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నేడు వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్‌, వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకుంటున్న అంద‌రికీ అభినంద‌న‌లు. అంటూ ట్వీట్‌ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.