Leading News Portal in Telugu

వివేకా హత్య.. దస్తగిరి మళ్లీ అరెస్ట్..! | viveka murder case approver dastagiri arrest| kidnap| scst| atricity| case| kadapa


posted on Nov 1, 2023 12:19PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ సొంత చిన్నాన్న  వివేకా దారుణ హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని ఉమ్మడి కడప జిల్లాలోని ఎర్రగుంట్ల పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఓ ప్రేమికుల జంటను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆతడినీ, అతడి బంధువులను మంగళవారం (అక్టోబర్ 31) పోలీసులు అదుపులోకి తీసుకొని.. వారిపై కిడ్నాప్‌తోపాటు  ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదు చేసి.. కమలాపురం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించడంతో  కడప జైలుకు తరలించారు.  2019, మార్చి 14 అర్థరాత్రి పులివెందుల్లోని సొంత గృహంలో వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. 

అనంతరం చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వివేకా కుమార్తె  సునీత.. న్యాయ స్థానాన్ని ఆశ్రయించి.. తన తండ్రి హత్య కేసు సీబీఐతో విచారణ జరిపించాలని కోరగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అలా ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత… దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. ఈ వివేకా హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారుల పేర్లు బహిర్గతం చేయడమే కాకుండా.. ఈ హత్య కేసులో సీఎం  జగన్ సోదరుడు కడప ఎంపీ   అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి   భాస్కరరెడ్డి సూత్రధారులుగా ఉన్నారని, అలాగే ఈ హత్య ద్వారా కోట్లాది రూపాయిల సూపారీ సైతం చేతులు మారిందని తెలిపారు. దీంతో దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా  సీబీఐ  దర్యాప్తు చేపట్టి.. పలువురు నిందితులను అరెస్ట్ చేసింది. 

అందులోభాగంగా   భాస్కరరెడ్డినీ అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో ఎ8 గా ఉన్న   అవినాష్ రెడ్డి మాత్రం తెలంగాణ హైకోర్టు నుంచి ముందుస్తుగానే బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకోనే క్రమంలో.. పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో ఏపీ సీఎం  జగన్… పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడంతో.. ఈ కేసు దర్యాప్తు దాదాపుగా నెమ్మదించింది. మరోవైపు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి.. బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆతడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఓ ప్రచారం   స్థానికంగా గతంలోనే జోరందుకొంది. 

అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలంటూ అతడికి సీబీఐ అధికారులు సూచించారన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో  షేక్ దస్తగిరి మళ్లీ.. అరెస్ట్ కావడంతో.. ఆతడి ప్రాణాలకు ఎటు వైపు నుంచి ముప్పు పొంచి ఉందో అనే అనుమానం సీమ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎంపీ   అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావాలనే తన భర్తను ఈ కేసులో ఇరికించారని షేక్ దస్తగిరి భార్య  ఆరోపించారు. 

అలాగే అప్రూవర్‌గా మారి బయట ఉన్న షేక్ దస్తగిరి బెయిల్ రద్దు చేయాలంటూ ఈ ఏడాది జులైలో హైకోర్టులో   వివేకా పీఏ కృష్ణారెడ్డి,   అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి పిటిషన్లు వేసిన విషయం విదితమే. అదీకాక   వివేకా హత్య కేసులో అరెస్ట్ అయి బయట ఉన్న  అవినాష్ రెడ్డి తండ్రి   భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్‌ గడువు నవంబర్ 1వ తేదీతో ముగియనుంది. అలాంటి వేళ.. షేక్ దస్తగిరి అరెస్ట్ కావడం పట్ల .. పలు సందేహాలు  వ్యక్తమవుతున్నాయి.