చంద్రబాబు బెయిల్ పై సీఐడీ అనుబంధ పిటిషన్.. తీర్పు రిజర్వ్ | babu bail cid supplementary petition| high| court| judgement| reserve| verdict
posted on Nov 1, 2023 4:36PM
చంద్రబాబు బెయిల్‌పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు బెయిలు నిబంధనలను ఉల్లంఘించారనీ, మరింత కఠినమైన షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. సీఐడీ పిటిషన్ పై బుధవారం (నవంబర్ 1) విచారించిన హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. ఇలా ఉండగా సీఐడీ కోరుతున్న షరతులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ తీర్పు శుక్రవారం(నవంబర్ 3) వెలువడే అవకాశాలు ఉన్నాయి.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్యంతబెయిలులో మరిన్ని షరతులు విధించాలని తన అనుబంధ పిటిషన్ లో సీఐడీ కోరింది. మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారనీ తద్వారా షరతులను ఉల్లంఘించారనీ పేర్కొంటూ అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగులను కోర్టుకు సమర్పించింది. అలాగే రాజమహేంద్ర వరం నుంచి భారీ ర్యాలీగా విజయవాడకు వచ్చారనీ కోర్టుకు ర్యాలీలు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా…రాజమహేంద్రవరం నుంచి 13 గంటల పాటు ర్యాలీగా విజయవాడకు వచ్చారని కోర్టుకు తెలిపింది.
దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు చంద్రబాబు కోర్టు ఆదేశాలను అతిక్రమించలేదనీ, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మాట్లాడటం ప్రాథమిక హక్కులో భాగమే తప్ప షరతుల అతిక్రమణ కాదని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయస్థానం తీర్పు శుక్రవారం(నవంబర్3)కు వాయిదా వేసింది.