Leading News Portal in Telugu

విజయశాంతి భావోద్వేగ ట్వీట్ ..ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు? 


posted on Nov 1, 2023 5:13PM

విజయశాంతి చేసిన ఓ భావోద్వేగ ట్వీట్ ఆమె బీజేపీలో ఉక్కపోతకు గురౌతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేదిగా ఉంది. గత కొంత కాలంగా ఆమె బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన రెండు సందర్భాలలోనూ ఆమె మోడీ సభలకు హాజరు కాలేదు. దీంతో ఆమె త్వరలో బీజేపీకి గుడ్ బై చెబుతారన్న వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నా విజయశాంతి బీజేపీనే అంటిపెట్టుకుని ఉండటంతో ఆ ప్రచారం అంతా ఉత్తిదేనని అంతా భావించారు. అయితే ఉరుము లేని పిడుగులా విజయశాంతి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తెలంగాణ ఉద్యమం నాటి ఉద్వేగాన్నీ, ఉద్యమ  ఆంకాంక్షలను వెల్లడించారు. తెలంగాణ  బిడ్డల  క్షేమం  తప్ప నాడు  ఉద్యమంలో   తాము  ఇంకేం కోరుకోలేదనీ, అలాగే ఉద్యమ ఫలితం తెలంగాణ  రాష్ట్రం వచ్చిన తరువాత తాము  వ్యతిరేకించింది కేసీఆర్ దోపిడీనీ, కుటుంబ పాలననే  తప్ప.. బీఆర్ఎస్ కార్యకర్తలను కాదనీ, తన పోరాటం కేసీఆర్  కుటుంబపాలన, కొందరు  బీఆర్ఎస్ నేతల  అరాచకత్వంపైనేనని స్పష్టం  చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. తెలంగాణ బిడ్డలు.. వారు ఏ  పార్టీ కార్యకర్తలైనా అంతా సంతోషంగా  గౌరవంగా ఉండాలన్నదే తన  ఆకాంక్ష  అని  ఆ  ట్వీట్ లో పేర్కొన్నారు. జై తెలంగాణ అంటూ తన పోస్టును ముగించిన విజయశాంతి.. రాజకీయ కార్యాచరణ ఏంటన్నది ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్ద చర్చగా మారింది. గతంలో ఒక సందర్భంలో విజయశాంతి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.  ఇప్పటి ట్వీట్ లో రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు.  తన పాతికేళ్ల రాజకీయ జీవితం అంతా సంఘర్షణతోనే గడిచిపోయిందన్న నిర్వేదం ఆమె ట్వీట్ లో ప్రస్ఫుటమైంది. ఎన్నడూ పదవుల కోసం పాకులాడకపోయినా అదే పరిస్థితి ఎందుకు ఎదురౌతున్నదో అవగతం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ట్వీట్ తరువాత ఇప్పుడు ఆమె రాజకీయ అడుగులు ఎటుపడనున్నాయన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.