Leading News Portal in Telugu

Volunteer Physical Harassment: మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ వేధింపులు.. కోరిక తీర్చాలంటూ..!


Volunteer Physical Harassment: మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ వేధింపులు.. కోరిక తీర్చాలంటూ..!

Volunteer Physical Harassment: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్‌ వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇదే సమయంలో.. కొందరు వాలంటీర్ల వెకిలిచేష్టలు మొత్తం వాలంటీర్‌ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా తయారవుతున్నాయి.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాలంటీచర్ల అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. వెంటనే వారిపై ప్రభుత్వం చర్యలకు కూడా పూనుకుంది.. కొందరు మర్డర్లు, అత్యాచార కేసుల్లోనూ దొరికిపోయారు.. తాజాగా.. ఓ వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.. ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఓ వాలంటీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా వాలంటీర్‌.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం పలివెలలో మహిళా వాలంటీర్‌కు మరో వాలంటీర్‌ నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.. మౌనంగా కొన్ని రోజుల పాటు వేధింపులను భరించిన సదరు మహిళా వాలంటీర్‌.. ఇంకా వేధింపులు పెరగడంతో.. పోలీసులను ఆశ్రయించింది.. మహిళ వాలంటీర్‌ను తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధించ సాగాడు సుబ్రహ్మణ్యం అనే మరో వాలంటీర్‌.. మొదట్లో సున్నితంగా మందలించినా అతడి బుద్ది మారలేదు సరికదా.. రోజురోజుకూ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సదరు మహిళా వాలంటీర్‌ పేర్కొన్నారు. బాధిత వాలంటీర్‌ ఫిర్యాదుతో సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేశారు కొత్తపేట పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.