
వరుస ఓటములతో కొంత నిరాశతో ఉన్న న్యూజిలాండ్ టీమ్ కు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరుగనున్న కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి రానున్నట్లు సమాచారం. అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన బొటవేలికి గాయమైంది. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు.
అయితే కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఆడతాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ.. ఈ న్యూస్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. విలియమ్సన్ జట్టులో చేరితే విల్ యంగ్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. విలియమ్సన్ జట్టులోకి రావడం వల్ల.. ఆ జట్టుకు బలం మరింత చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే కేన్.. ఓ సీనియర్ ఆటగాడు కాబట్టి, అంతేకాకుండా కెప్టెన్ గా అతనికి ఎంతో అనుభవం ఉంది. అతని కెప్టెన్సీలో న్యూజిలాండ్ టీమ్ ఎన్నో విజయాలను అందుకుంది. ఈ నేపధ్యంలో అతను జట్టులోకి రావడం చాలా ముఖ్యం.
మరోవైపు.. కేన్ విలియమ్సన్ జట్టులో లేకపోవడం వల్లే న్యూజిలాండ్ గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఈనెల 22న టీమిండియా ఆడి ఓడిపోగా.. ఆతర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ ఫైట్ లో కివీస్ పోరాడి ఓడింది. ఈ రెండు మ్యాచ్‌లకు ముందు న్యూజిలాండ్.. పటిష్టంగా కనిపిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. కానీ భారత్, ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు టాప్-4లో ఉన్నాయి.