
PM Modi: ఈ నెలలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక గిరిజన వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు.
సమాజంలో ప్రతీ వర్గానికి అభివృద్ధి, ప్రగతి లబ్ధి చేకూరుతుందనేది బీజేపీ విధానమని, చరిత్రలో తొలిసారిగా గిరిజన కుటుంబానికి చెందిన మహిళను రాష్ట్రపతి చేయాలని బీజేపీ నిర్ణయించిందని, కానీ దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమెపై దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిరసనలు బీజేపీకి మాత్రమే వ్యతిరేకం కాదని, గిరిజనులకు కూడా వ్యతిరేకమే అని కాంకేర్ లో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ప్రధాని అన్నారు.
Read Also: Canada: కెనడాలో శాశ్వతం స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. 4.85 లక్షల మందికి పీఆర్..
అసాధ్యమనిపించిన పనులను తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం చేసి చూపించిందని ప్రధాని మోడీ అన్నారు. మోడీ హమీ ఇస్తే, అది నెరవేరుతుందని, చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆ పార్టీ నాయకులు స్వలాభం కోసమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఛత్తీస్గడ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రజలు, బీజేపీ కలిసి పనిచేశాయని అన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు చూస్తూనే ఉన్నారు.. ఇన్నేళ్లలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులకు మాత్రమే బంగ్లాలు, కార్లు, ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్, అభివృద్ధి రెండూ కలిసి ఉండవని, పేదల సంక్షేమమే కేంద్రంలోని తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 7, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.