తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న షర్మిల | ysrtp not to contest in telangana| unconditional| support| congress| indicates| stepping| towards
posted on Nov 3, 2023 12:37PM
తెలంగాణ ఎన్నికల బరి నుంచి షర్మిల తప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
గెలవడం కంటే త్యాగం చేయడం గొప్ప విషయం అని చెప్పిన షర్మిల.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించే లక్ష్యంతో పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు మృగ్యమన్న విషయాన్ని తెలుగువన్ ముందే చెప్పింది. తెలంగాణ ఎన్నికల అనంతరం ఆమె అడుగులు ఏపీ వైపు పడతాయని కూడా సరిగ్గా అంచనా వేసింది. తెలుగువన్ చెప్పినట్లుగానే తెలంగాణ ఎన్నికల బరి నుంచి వైదొలగి, కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల అనంతరం ఆమె ఏపీలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని అవగతమౌతున్నది.
తెలంగాణ ఎన్నికల తరువాత షర్మిల అడుగులు ఏపీవైపు.. హస్తం ఆహ్వానించేనా?
అసలు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిన క్షణం నుంచీ షర్మిలను ఏపీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ కోరుతూ వస్తున్నది. వైఎస్ వారసత్వం కాంగ్రెస్ కు తెలంగాణలో మైనస్ అవుతుందని భావించిన కాంగ్రెస్.. ఏపీలో అదే ప్లస్ అవుతుందని భావిస్తోంది. అందుకే తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకుండా ఏపీకి పరిమితం కావాలని అప్పట్లోనే సూచించింది. అయితే అప్పటికి తిరస్కరించిన షర్మిల.. తెలంగాణ ఎన్నికలలో వైఎస్సార్టీపీ ప్రభావం చూపే అవకాశం ఇసుమంతైనా లేదని గ్రహించి.. ఇక్కడ కాంగ్రెస్ కు బేషరతు మద్దతు పలుకుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం ద్వారా.. ఏపీలో కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించినట్లు చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.